latest news
ఈ అనుమతులు ఉంటే 22ఏలో ఉన్నా రిజిస్ట్రేషన్లు.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన

తెలంగాణలో ఇళ్లు, ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేసి ఏళ్ల తరబడి రిజిస్ట్రేషన్లు కాక ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. రిజిస్ట్రేషన్ యాక్ట్-1908లోని సెక్షన్-22ఏ కింద నిషేధిత జాబితా (ప్రొహిబిషన్ ఆర్డర్ బుక్)లో ఉన్నప్పటికీ.. చట్టబద్ధమైన అనుమతులతో అభివృద్ధి చేసిన ఆస్తుల క్రయవిక్రయాలకు లైన్ క్లియర్ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి లోకేశ్‌కుమార్ గురువారం రాత్రి అత్యంత కీలకమైన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA), మరియు డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (DTCP) నుంచి అధికారిక అనుమతులు పొందిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు ఉన్న అన్ని రకాల అడ్డంకులు తొలగిపోయాయి. ఇప్పటికే నిషేధిత జాబితా సమస్యలతో ప్రజలు పడుతున్న ఇబ్బందిని గుర్తించిన ప్రభుత్వం గతంలో జీవో నెం.118, జీవో నెం.76లను జారీ చేయగా.. తాజా ఆదేశాలతో మరింత ఊరట లభించింది.
తాజా ఉత్తర్వుల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలో 44 కాలనీలు, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలో 65 కాలనీలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 264 కాలనీల్లో ఆస్తులు, భూముల విక్రయాలకు పూర్తి స్వేచ్ఛ లభించింది. అయితే, ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొన్ని స్పష్టమైన నిబంధనలను ప్రభుత్వం ఉంచింది. ఏదైనా కోర్టు లేదా న్యాయస్థానం నుంచి ప్రతికూల తీర్పులు లేదా స్టే ఉత్తర్వులు ఉంటే మాత్రం ఆయా ఆస్తులు, భూములకు రిజిస్ట్రేషన్లు చేయడానికి వీలుండదు. తుది తీర్పులకు లోబడి మాత్రమే క్రయవిక్రయాలు జరగాల్సి ఉంటుంది. ఆస్తులు విక్రయించేవారు లేదా కొనుగోలు చేసేవారు విధిగా చెల్లుబాటయ్యే సరైన పత్రాలను సమర్పించాలి. లింక్ డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటేనే అధికారులు రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తారు.
సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయి కమిటీ:
ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఒకవేళ ఏవైనా సాంకేతిక సమస్యలు లేదా వివాదాలు తలెత్తితే వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు వీలుగా ప్రభుత్వం ఒక ప్రత్యేక జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సంబంధిత జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా.. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా రిజిస్ట్రార్, హెచ్ఎండీఏ లేదా పురపాలక/గ్రామీణ స్థానిక సంస్థల ప్రతినిధి సభ్యులుగా కొనసాగుతారు. ప్రభుత్వ ఈ నిర్ణయంతో రియల్ రంగంతో పాటు మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
