latest news
'గొలుసు' విప్పితే రూ.2 కోట్ల మాయం.. ఖాకీ అండతోనే అమాయకులకు వల?

బాధ్యతగల ఓ స్టేషన్ పోలీసు అధికారి.. ఆన్లైన్ జూదాల, ట్రేడింగ్ మోసాలపట్ల ప్రజలను అప్రమత్తం చేయాలి! కానీ.. ధనార్జనే ధ్యేయంగా.. తానే ఆ ‘వ్యాపారం’లోకి దిగి మరికొంతమందిని ముంచేశారు.
విశాఖపట్నం:పెట్టుబడి పెడితే చాలు.. కూర్చున్న చోటికే లాభాల పంట పండుతుందంటూ నగరంలో సాగిన ఒక గొలుసుకట్టు (మల్టీ లెవెల్ మార్కెటింగ్) దందా చివరకు రూ.2 కోట్ల కుంభకోణంగా రూపాంతరం చెందింది. అయితే, ఈ కథనంలో కేవలం ఒక ప్రైవేట్ సంస్థ బోర్డు తిప్పేయడం మాత్రమే కాదు.. సమాజానికి రక్షణగా నిలవాల్సిన ఒక సబ్ ఇన్స్పెక్టర్ (SI) పాత్రపై వస్తున్న ఆరోపణలు ఇప్పుడు విశాఖ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ఖాకీపై నమ్మకమే బాధితులకు శాపమా?:
సాధారణంగా ఇలాంటి ఆన్లైన్ లేదా చైన్-లింక్ స్కీమ్లను ప్రజలు అంత తేలిగ్గా నమ్మరు. కానీ, ఇక్కడే నిందితులు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. బాధితుల ఆరోపణల ప్రకారం.. నగర పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సదరు ఎస్ఐ గడిచిన కొంతకాలంగా స్థానిక బాధితులు, వారి కుటుంబ సభ్యులతో కావాలనే అత్యంత సన్నిహితంగా పరిచయాలు పెంచుకున్నారు.ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి స్వయంగా రంగంలోకి దిగి.. "సదరు సంస్థలో పెట్టుబడి పెట్టండి.. మరికొందరిని చేర్పించండి.. మీ పెట్టుబడికి తిరుగుండదు.. భారీగా కమీషన్లు వస్తాయి" అని ఒత్తిడి చేయడంతో బాధితులు వెనుకాడలేదు. ఖాకీ యూనిఫామ్ ఇచ్చిన నమ్మకంతో, తమ కష్టార్జితాన్ని మరియు పొదుపు మొత్తాలను తెచ్చి ఆ సంస్థ చేతిలో పెట్టారు. అలా చూస్తూ చూస్తూనే పలువురు బాధితుల నుండి సుమారు రూ. 2 కోట్ల వరకు పెట్టుబడులు సేకరించబడ్డాయి
.లాభాల మాట దేవుడెరుగు.. అసలుకే ఎసరు!:
బాధితులు డబ్బులు డిపాజిట్ చేసిన కొన్నాళ్లకే సదరు ప్రైవేట్ సంస్థ తన అసలు రంగును బయటపెట్టింది. లాభాల చెల్లింపులు నిలిపివేయడమే కాకుండా, రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసి దుకాణం సర్దేసింది. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు గగ్గోలు పెడుతూ, ఎస్ఐ మాటలు నమ్మి రోడ్డున పడ్డామంటూ ఆందోళనకు దిగారు.
తెరవెనుక ఏం జరుగుతోంది?:
ఈ దందా వ్యవహారం గుప్పుమనగానే సదరు ఎస్ఐ ఒక్కసారిగా 'వ్యక్తిగత కారణాల' పేరిట దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడం పలు అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. ఒకవైపు బాధితులు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి ఆందోళనలు చేస్తుంటే.. మరోవైపు నిందితుడు సెలవులో అజ్ఞాతంలోకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.స్టేషన్ ఉన్నతాధికారులు మాత్రం.. బాధితులు ఎస్ఐని నిలదీయడానికి స్టేషన్కు వచ్చిన మాట వాస్తవమేనని చెప్తూనే, ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక రాతపూర్వక ఫిర్యాదు (Written Complaint) అందలేదని పేర్కొనడం గమనార్హం.ఈ 'గొలుసుకట్టు' మోసం వెనుక కేవలం ప్రైవేట్ వ్యక్తులు మాత్రమే ఉన్నారా? లేక సదరు ఎస్ఐ కి కమీషన్ల రూపంలో భారీగా లాభాలు అందాయా? అనే కోణంలో సమగ్ర విచారణ జరగాల్సి ఉంది. బాధితులు అధికారికంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే కానీ ఈ ఆర్థిక నేరం వెనుక ఉన్న అసలు సూత్రధారులు, పాత్రధారుల పూర్తి ముసుగు తొలగిపోయే అవకాశం లేదు.
