latest news
రెసిడెన్షియల్ కంటే కమర్షియల్ ప్రాపర్టీలకే రెట్టింపు అద్దె రాబడి!

భారతీయ స్థిరాస్తి మార్కెట్‌లో పెట్టుబడిదారుల దృష్టి మారుతోంది. కేవలం ఇళ్లు, అపార్ట్‌మెంట్ల కొనుగోలుపైనే కాకుండా వాణిజ్య ఆస్తులు , ఆఫీస్ స్పేస్‌ల వైపు ఇన్వెస్టర్లు భారీగా మొగ్గు చూపుతున్నారు. సాధారణ నివాస ప్రాంతాల ద్వారా వచ్చే అద్దె రాబడితో పోలిస్తే, కమర్షియల్ ఆస్తుల ద్వారా వచ్చే రాబడి ఎంతో అధికంగా ఉంటుందని మార్కెట్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పెట్టుబడిపై గరిష్ట లాభాలు పొందాలనుకునే వారికి వాణిజ్య స్థిరాస్తులు చక్కటి ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి.
ప్రస్తుత మార్కెట్ ట్రెండ్స్ ప్రకారం, సాధారణ రెసిడెన్షియల్ ప్రాపర్టీల ద్వారా వస్తున్న అద్దె రాబడి కేవలం 3 శాతం నుంచి 4.6 శాతం మధ్యే ఉంటోంది. అంటే మనం పెట్టిన పెట్టుబడికి ఏడాదికి వచ్చే అద్దె రూపేణా నామమాత్రపు లాభమే దక్కుతుంది. కానీ, దీనికి భిన్నంగా కమర్షియల్ ఆస్తులు, దుకాణాలు , కార్పొరేట్ ఆఫీస్ స్పేస్‌ల ద్వారా ఏకంగా 7 శాతం నుంచి 9 శాతం వరకు అద్దె రాబడిని పొందవచ్చని నిపుణులు గణాంకాలతో సహా నిరూపిస్తున్నారు. ఈ భారీ వ్యత్యాసమే ఇన్వెస్టర్లను కమర్షియల్ వైపు ఆకర్షిస్తోంది.
ఈ గణనీయమైన లాభాలకు ప్రధాన కారణం కార్పొరేట్ సంస్థలతో కుదుర్చుకునే దీర్ఘకాలిక లీజ్ ఒప్పందాలు . రెసిడెన్షియల్ అద్దెదారులు తరచుగా మారుతుండటం, మెయింటెనెన్స్ సమస్యలు ఎదురుకావడం జరుగుతుంటాయి. అయితే వాణిజ్య భవనాలకు మాత్రం ప్రముఖ కంపెనీలు, బ్యాంకులు లేదా రిటైల్ బ్రాండ్లు సుదీర్ఘకాలం పాటు అద్దెకు ఒప్పందాలు చేసుకుంటాయి. అంతేకాకుండా ప్రతి ఏటా అద్దెలో నిర్దిష్ట శాతంలో పెరుగుదల ఉండేలా నిబంధనలు ఉండటం ఇన్వెస్టర్లకు మరింత లాభసాటిగా మారుతోంది.
అయితే, కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టేందుకు సాధారణ రెసిడెన్షియల్ ఆస్తులతో పోలిస్తే ప్రారంభ మూలధనం చాలా ఎక్కువగా అవసరమవుతుంది. చిన్న ఇన్వెస్టర్లు నేరుగా వాణిజ్య భవనాలను కొనుగోలు చేయడం కష్టమైనప్పటికీ, ఇటీవల కాలంలో వస్తున్న రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్ వంటి అధునాతన మార్గాలు వారికి ఎంతో ఊరటనిస్తున్నాయి. తక్కువొక మొత్తంతోనూ కమర్షియల్ ప్రాపర్టీల్లో భాగస్వాములయ్యే అవకాశం లభిస్తుండటంతో, భవిష్యత్తులోనూ వాణిజ్య ఆస్తులదే పైచేయిగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
