Back to latest news

latest news

రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడుల పేరుతో రూ.13.31 కోట్ల మోసం!

14 September 2026

 రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడుల పేరుతో రూ.13.31 కోట్ల మోసం!

16 మంది నుంచి భారీగా వసూళ్లు.. ఇద్దరు ప్రధాన నిందితుల అరెస్ట్‌.. మరో నిందితుడి కోసం గాలింపు:

ఆదిలాబాద్‌: రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి 16 మంది నుంచి ఏకంగా రూ.13.31 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆదిలాబాద్‌ పోలీసులు ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారి నుంచి రెండు వాహనాలు, విలువైన ప్లాట్లు, స్థలాలకు సంబంధించిన పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌ పట్టణం శాంతినగర్‌కు చెందిన సాయిని ప్రవీణ్‌కుమార్‌ ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పేరుతో ఫిర్యాదుదారుడి నుంచి విడతల వారీగా బ్యాంకు ఖాతాల ద్వారా రూ.1.40 కోట్లు, నగదు రూపంలో మరో రూ.30 లక్షలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

మొదట కొంత మొత్తాన్ని లాభంగా తిరిగి ఇచ్చి నమ్మకం కలిగించిన నిందితులు.. ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని చెల్లించకుండా కాలయాపన చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, దర్యాప్తు చేపట్టిన అధికారులు ఇదే తరహాలో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు.

నిందితులు వసూలు చేసిన డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టారు? ప్లాట్ల కొనుగోళ్ల వెనుక అసలు వ్యవహారం ఏమిటి? ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

అధిక లాభాల ఆశ.. నమ్మకమే పెట్టుబడి.. చివరకు కోట్లలో కుచ్చుటోపీ!

రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడుల పేరుతో రూ.13.31 కోట్ల మోసం! | సప్తచక్ర పబ్లిక్ వాయిస్