Back to latest news

latest news

ప్రభుత్వ భూముల కబ్జా నుంచి రికార్డుల తారుమారు వరకు.. టీడీపీ ప్రజావినతుల్లో భూ బాధితుల గళం

11 September 2026

 ప్రభుత్వ భూముల కబ్జా నుంచి రికార్డుల తారుమారు వరకు.. టీడీపీ ప్రజావినతుల్లో భూ బాధితుల గళం

రూ.24 కోట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఫిర్యాదు.. 90 ఏళ్ల వారసత్వ భూమి రికార్డులు మార్చారంటూ మరో అర్జీ

అమరావతి: ప్రభుత్వ భూముల ఆక్రమణలు, భూ రికార్డుల తారుమారు, రీసర్వేలో అవకతవకలు, వారసత్వ భూముల వివాదాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో మోసాల ఆరోపణలపై పలువురు బాధితులు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల కార్యక్రమాన్ని ఆశ్రయించారు. అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా సమస్యలు పరిష్కారం కాలేదని, ఉన్నతస్థాయిలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వారు కోరారు.

ఏపీ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ పొలంరెడ్డి దినేష్ రెడ్డి కి ప్రజలు తమ సమస్యలను వివరించారు. భూ వివాదాలతో పాటు పింఛన్లు, రేషన్, ఇళ్ల నిర్మాణం, ఉద్యోగాలు, వైద్య, ఆర్థిక సహాయం తదితర అంశాలపై కూడా వినతులు అందాయి.

రూ.24 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా ఆరోపణ

వైఎస్సార్ కడప జిల్లా మడకలవారిపల్లి గ్రామానికి చెందిన బి. నారాయణ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఆంజనేయులు తమ గ్రామంలోని సర్వే నంబర్ 977/3 లోని 2.34 ఎకరాల ప్రభుత్వ భూమి పై ఫిర్యాదు చేశారు. తమ అంచనా ప్రకారం ఈ భూమి విలువ సుమారు రూ.24 కోట్లు ఉంటుందని తెలిపారు.

ఈ ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించి రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని వారు ఆరోపించారు. గతంలో భూమిపై నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ ఆక్రమణలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ.. ప్రభుత్వ భూమిని పరిరక్షించి, ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

90 ఏళ్ల వారసత్వ భూమి.. రికార్డులు ఎవరి ప్రయోజనానికి?

కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం దోసపాడు గ్రామానికి చెందిన నెక్కలపూడి సుబ్బలక్ష్మి మరో కీలక భూ వివాదంపై అర్జీ సమర్పించారు. బాపులపాడు మండలం వీరవల్లి పరిధిలోని సర్వే నంబర్ 256/16 లో 76 సెంట్లు , అలాగే 256/15, 19 సబ్‌ డివిజన్లలోని భూములతో కలిపి సుమారు ఎకరం 49 సెంట్ల భూమి తమ కుటుంబానికి చెందినదని ఆమె తెలిపారు.

దాదాపు 90 ఏళ్ల క్రితం తన తాత ఆలపాటి వెంకయ్య నుంచి తన తండ్రి ఆలపాటి రాఘవయ్యకు ఈ భూమి వాటాగా వచ్చిందని వివరించారు. 2012లో భూమిపై ఆక్రమణలు జరిగినప్పుడు అప్పటి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ, రెవెన్యూ అధికారులు ఆ భూమిని ‘బీడు భూమి’గా పేర్కొంటూ నివేదిక ఇచ్చారని ఆమె ఆరోపించారు.

అంతేకాకుండా, తమ బాబాయి విక్రయించిన భూమికి సంబంధించి తమ వాటాగా వచ్చిన 76 సెంట్ల భూమి రికార్డులను కూడా మార్చి, ఆళ్ల వెంకటేశ్వరరావుకు అనుకూలంగా నమోదు చేశారని ఆమె ఆరోపించారు. పలుమార్లు అధికారులను ఆశ్రయించినా సమస్య పరిష్కారం కాలేదని పేర్కొంటూ, పాత రికార్డులు, హక్కు పత్రాలు, రెవెన్యూ నమోదులను సమగ్రంగా పరిశీలించి న్యాయం చేయాలని కోరారు.

భూములపై ఫిర్యాదులు.. అధికారులపై ప్రశ్నలు

ఒకవైపు కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూముల ఆక్రమణ ఆరోపణలు, మరోవైపు తరతరాలుగా వస్తున్న వారసత్వ భూముల రికార్డుల మార్పుల ఆరోపణలు ప్రజావినతుల కార్యక్రమంలో వెలుగుచూశాయి.

ప్రభుత్వ భూమి ప్రైవేట్ ప్రయోజనాలకు ఎలా చేరింది? పాత భూ రికార్డుల్లో మార్పులు జరిగాయా? జరిగితే ఎవరి ఆదేశాలతో జరిగాయి? ఇప్పటికే ఫిర్యాదులు ఉన్నప్పటికీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.

బాధితుల ఆరోపణలపై సంబంధిత రెవెన్యూ రికార్డులు, పాత రిజిస్ట్రేషన్ పత్రాలు, సర్వే వివరాలు, నిషేధ ఉత్తర్వులు, అధికారుల గత నివేదికలను పరిశీలించి స్వతంత్రంగా విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ప్రభుత్వ భూముల కబ్జా నుంచి రికార్డుల తారుమారు వరకు.. టీడీపీ ప్రజావినతుల్లో భూ బాధితుల గళం | సప్తచక్ర పబ్లిక్ వాయిస్