Back to latest news

latest news

వ్యవసాయ భూమి ప్లాట్ల విక్రయంపై రెరా ట్రైబ్యునల్ చారిత్రాత్మక తీర్పు: వినియోగదారులకు భారీ ఊరట

11 September 2026

వ్యవసాయ భూమి ప్లాట్ల విక్రయంపై రెరా ట్రైబ్యునల్ చారిత్రాత్మక తీర్పు: వినియోగదారులకు భారీ ఊరట

హైదరాబాద్: కేవలం పత్రాల్లో ‘వ్యవసాయ భూమి’ అని పేర్కొన్నంత మాత్రాన రియల్ ఎస్టేట్ నిబంధనల నుండి, రెరా (RERA) పరిధి నుండి తప్పించుకోలేరని తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రైబ్యునల్ ఒక సంచలన తీర్పును వెలువరించింది.

వ్యవసాయ భూములను ఫామ్‌హౌస్‌లు, ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్న మోసపూరిత వెంచర్లకు ఈ తీర్పు గట్టి హెచ్చరికగా నిలిచింది.వివాదం నేపథ్యం:వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తుమ్మనపల్లిలో ‘ఎస్‌ఎన్‌ఎస్‌ఎల్ ఇన్‌ఫ్రా డెవలపర్స్’ సంస్థ ‘పీకాక్ అవెన్యూ’ పేరుతో 360 ఎకరాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా 88 ప్లాట్లతో అక్రమ వెంచర్ వేసింది. ఉదెల అన్నపూర్ణ అనే మహిళకు 4 గుంటల స్థలాన్ని రూ.16.94 లక్షలకు విక్రయించి, రిజిస్ట్రేషన్‌లో మాత్రం కేవలం రూ.10 వేలుగా చూపించారు. శ్రీగంధం మొక్కలు పెంచి, బైబ్యాక్ గ్యారంటీతో పాటు నెలకు రూ.16 వేల లీజు ఇస్తామని నమ్మించి, 2023 నుండి లీజు చెల్లించకుండా డెవలపర్ మోసానికి పాల్పడ్డాడు. ఇది వ్యవసాయ భూమి కాబట్టి రెరా పరిధిలోకి రాదన్న బిల్డర్ వాదనను ట్రైబ్యునల్ పూర్తిగా తిరస్కరించింది.

ట్రైబ్యునల్ తీర్పు - ముఖ్యాంశాలు:

రెరా పరిధి వర్తిస్తుంది: వ్యవసాయ భూమిని ప్లాట్లుగా విభజించి, రోడ్లు వేసి, బ్రోచర్లతో ప్రకటనలు చేయడం పూర్తిస్థాయి రియల్ ఎస్టేట్ కార్యకలాపమే. కాబట్టి ఇది కచ్చితంగా రెరా చట్టం కిందకే వస్తుంది.

బాధితురాలికి న్యాయం: నిబంధనలు ఉల్లంఘించిన డెవలపర్‌కు జరిమానా విధించాలని రెరాను ఆదేశిస్తూ.. బాధితురాలికి రావాల్సిన లీజు మొత్తాన్ని 10.70 శాతం వడ్డీతో కలిపి 6 రోజుల్లోగా చెల్లించాలని ట్రైబ్యునల్ చైర్మన్ ఎ. సంతోష్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.

రాష్ట్రవ్యాప్త నిఘా: ఫామ్‌హౌస్ ప్లాట్ల పేరుతో సాగుతున్న అక్రమ వెంచర్లను గుర్తించి, వాటిని రెరా పరిధిలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని రెరా కార్యదర్శిని ఆదేశిస్తూ.. దీనిపై 8 వారాల్లో నివేదిక సమర్పించాలని గడువు విధించింది.

ఈ తీర్పుతో రియల్ ఎస్టేట్ రంగంలో వ్యవసాయ భూముల పేరుతో సాగుతున్న మోసాలకు అడ్డుకట్ట పడనుంది. ప్లాట్లు కొనే ముందు వినియోగదారులు కేవలం ప్రకటనలు నమ్మకుండా, సదరు వెంచర్‌కు DTCP/HMDA లేఅవుట్ అనుమతులతో పాటు అధికారిక రెరా రిజిస్ట్రేషన్ ఉందో లేదో ఖచ్చితంగా సరిచూసుకోవాలని చట్ట నిపుణులు సూచిస్తున్నారు.

వ్యవసాయ భూమి ప్లాట్ల విక్రయంపై రెరా ట్రైబ్యునల్ చారిత్రాత్మక తీర్పు: వినియోగదారులకు భారీ ఊరట | సప్తచక్ర పబ్లిక్ వాయిస్