latest news
రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరిట భారీ మోసం: రూ.2.67 కోట్లు కాజేసిన వైనం!

న్యూస్‌టుడే: రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి, రూ.కోట్లలో మోసానికి పాల్పడిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. నమ్మిన బంధువులే నిలువునా ముంచేసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పోలీసుల కథనం ప్రకారం.. బోడుప్పల్ బాలాజీహిల్స్ ప్రాంతానికి చెందిన చిలుకూరి కిషోర్‌బాబు, మాధవి దంపతులకు డొప్పలపూడి సాగర్ అనే వ్యక్తి బంధువు అవుతాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే తక్కువ కాలంలోనే భారీగా లాభాలు ఆర్జించవచ్చని సాగర్ ఆ దంపతులకు ఆశచూపాడు. బంధువే కదా అని నమ్మిన కిషోర్‌బాబు దంపతులు విడతల వారీగా మొత్తం రూ.2.67 కోట్లను సాగర్‌కు అందజేశారు.
తిరిగి అడిగితే బెదిరింపులు:
డబ్బులు తీసుకుని చాలా రోజులు గడుస్తున్నా.. తమ పేరిట ఎలాంటి ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది. తాము మోసపోయామని గ్రహించిన దంపతులు డబ్బుల విషయమై సాగర్‌ను గట్టిగా నిలదీశారు. దీంతో అతడు రూ.70 లక్షలను తిరిగి ఇచ్చాడు. మిగిలిన సొమ్మును ఇవ్వాల్సిందిగా కోరగా, బాధితులను బెదిరింపులకు గురిచేశాడు. ఈ మోసపూరిత లావాదేవీల్లో కాకర్ల ప్రవళిక, బాలాజీ అనే వ్యక్తుల ప్రమేయం కూడా ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
