Back to latest news

latest news

22A జాబితాతో హైదరాబాద్‌లో ఆస్తి యజమానులకు షాక్!

10 September 2026

22A జాబితాతో హైదరాబాద్‌లో ఆస్తి యజమానులకు షాక్!

రిజిస్టర్డ్ ఆస్తులకూ నిషేధం.. అసలు కారణమేంటో?

హైదరాబాద్: ఏళ్ల క్రితం చట్టబద్ధంగా కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆస్తులు ఇప్పుడు 22A నిషేధిత జాబితాలో కనిపిస్తుండటంతో హైదరాబాద్‌లో ఆస్తి యజమానుల్లో ఆందోళన మొదలైంది. విక్రయానికి లేదా రిజిస్ట్రేషన్‌కు వెళ్తే 22A కారణంగా లావాదేవీలు నిలిచిపోతున్నాయని బాధితులు చెబుతున్నారు.

ULC, ప్రభుత్వ భూములు తదితర విభాగాల్లో ఆస్తులను చేర్చినట్లు రికార్డుల్లో కనిపిస్తున్నప్పటికీ, ఏ ఆధారంతో.. ఎవరి ఆదేశాలతో.. ఎప్పుడు ఈ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చారన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. దశాబ్దాల క్రితం సేల్‌డీడ్లతో కొనుగోలు చేసిన పాత ఇళ్లు కూడా జాబితాలో కనిపిస్తున్నాయనే ఫిర్యాదులు మరింత కలకలం రేపుతున్నాయి.

సనత్‌నగర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, ఫిలింనగర్, జూబ్లీహిల్స్ వంటి కీలక ప్రాంతాల్లోనూ 22Aపై ఫిర్యాదులు వస్తున్నట్లు సమాచారం. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి రెవెన్యూ అధికారుల వద్దకు పంపుతున్నారంటూ బాధితులు వాపోతున్నారు.

ఆస్తి పన్నులు చెల్లిస్తూ.. బ్యాంకు రుణాలు తీర్చుకుంటూ.. దశాబ్దాలుగా అనుభవిస్తున్న ఆస్తి ఒక్కసారిగా 22Aలోకి ఎలా వచ్చింది? అన్న ప్రశ్నకు అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

22A జాబితా వ్యవహారంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి, తప్పుగా నమోదైన ఆస్తులను గుర్తించి పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు. ఆస్తి యజమానులు తమ సర్వే నంబర్, ప్రాపర్టీ వివరాలను అధికారిక రిజిస్ట్రేషన్ రికార్డుల్లో పరిశీలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

పత్రాలు మనవి.. ఆస్తి మనది.. అయినా అమ్ముకోలేని పరిస్థితి ఎందుకు? — హైదరాబాద్‌లో 22A ఇప్పుడు ఇదే పెద్ద ప్రశ్న.

22A జాబితాతో హైదరాబాద్‌లో ఆస్తి యజమానులకు షాక్! | సప్తచక్ర పబ్లిక్ వాయిస్